ఖమ్మం డెస్క్: మే 31 (ఖమ్మం వాణి)
 |
| కొప్పుల ఉపేందర్ రెడ్డి |
బీఆర్ఎస్ పార్టీలో యువత అత్యంత ఉత్సాహంగా పనిచేస్తోందని, వారి ఉత్సాహానికి ఎవరూ అడ్డుగోడలు కట్టవద్దని బీఆర్ఎస్ మండల నాయకులు కొప్పుల ఉపేందర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బీఆర్ఎస్ యువ నాయకులు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. "కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో యువత పనిచేస్తోంది. వారి ఆలోచనలకు, పనితీరుకు సీనియర్లు సహకరించాలి తప్ప, అడ్డు చెప్పవద్దు" అని ఆయన పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు మళ్లీ గుర్తుచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించి ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సీనియర్ నాయకులు, యువ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. "యువత కొత్త ఆలోచనలతో వస్తుంది. వారికి అవకాశం ఇస్తే పార్టీకి తిరుగులేదు. అడ్డుగోడలు కడితే నష్టం పార్టీకే" అని కొప్పుల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Post a Comment